దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కంచె పనులు
- అవసరమైన భూమిని 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలన్న సువేందు అధికారి
- ఈరోజు నుంచే భూ బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. సుమారు 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికి, మే 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, తొలి క్యాబినెట్ సమావేశంలోనే తమ పాలన ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు.
సంక్షేమ రంగంలో కూడా ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం 'ఆయుష్మాన్ భారత్'ను పశ్చిమ బెంగాల్‌లో నేటి నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు బేటీ బచావో-బేటీ పడావో, పీఎం ఉజ్వల యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తూ, గరిష్ఠ వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపును ప్రకటించడం నిరుద్యోగ యువతలో ఆనందాన్ని నింపింది.
పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర శిక్షణా కార్యక్రమాలకు పంపాలని నిర్ణయించడంతో పాటు, కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) వంటి వాటిని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది కుటుంబాలకు న్యాయం చేస్తామని, వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌ను 'సోనార్ బంగ్లా'గా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ 'డబుల్ ఇంజిన్' సర్కార్ వేగంతో పనిచేస్తుందని సువేందు అధికారి తన తొలి క్యాబినెట్ భేటీ ద్వారా చాటిచెప్పారు.